- మార్కెట్ ముందు చూపు
- 5-4-2010 నుండి 09-04-2010 వరకు
నూతన ఆర్ధిక సంవత్సరాన్ని మన మార్కెట్లు శుభారంభం చేసాయి. గడిచిన వారం మార్కెట్లు వరుసగా 8 వవారం మార్కెట్లు గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. ఈ జైత్ర యాత్ర లో సెన్సెక్స్ 1777 పాయింట్లు ఎగబాకాయి . సెన్సెక్స్ మార్చ్ 2009 నాటి కనిష్ట స్థాయి లైన 8100 పాయింట్ల నుండి 17693 పాయింట్ల వరకు ఎగబాకటం విశేషం . గత వారం విదేశీ సంస్థాగత మదుపరుల కొనుగోళ్ళ మద్దత్తు తో మార్కెట్లు బలపడ్డాయి. దీనితో సెన్సెక్స్ 17692 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 5290.50 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ వారం పూర్వార్థం లో మార్కెట్లు మరింత బలపడితే సెన్సెక్స్ 18000 పాయింట్ల వరకు ఎగబాకే అవకాశం ఉంది. ఐతే ఇది జరిగేందుకు ముఖ్యం గా ప్రపంచ విపణుల పోకడలు అత్యంత కీలకం . అమెరికా మార్కెట్ల లో విడుదల ఐన నిరుద్యోగ గణాంకాలు స్వల్పం గా తగ్గటం మార్కెట్ల సెంటిమెంట్ ని బలపరిచే అవకాశం ఉంది. ఐతే ఐరోపా మార్కెట్ల లో నెలకొని ఉన్న సంక్షోభం ఎప్పటికప్పుడు కొంత కలవరపెట్టవచ్చు . ఈ కారణం గా , మార్కెట్లు పెరిగితే, ట్రేడర్లు లాభాల స్వీకరణ పట్ల ఆసక్తి కనపరిచే అవకాశం ఉంది. కాబట్టి మొదటి రెండు రోజులు మార్కెట్లు నిలదొక్కుకోవటం ముఖ్యం. సోమవారం సాయంత్రం అమెరికా లో విడుదల కానున్న గృహ అమ్మకాల గణాంకాలు ప్రపంచ మార్కెట్ల దిశని ప్రభావితం చేయనున్నాయి.
మన దేశం లో చోటు చేసుకోబోయే అంశాలను పరిశీలిస్తే , ఈ వారం 3 G వేలం పట్ల మరిన్ని వివరాలు అందనున్నాయి. ఈ కారణం గా టెలికాం స్టాకుల లో కొంత చలనం కనపడవచ్చు .అదే విధం గా మార్చ్ తాలూకు ఉత్పత్తి గణాంకాలు సిమెంట్ మరియు స్టీల్ స్టాకులనుప్రభావితం చేయనున్నాయి. ఆటో రంగానికి చెందిన స్టాకులు కూడా ఈ వారం కొంత ఎగబాకవచ్చు. కార్ల తయారి దారులు ఈ వారం , తమ ఉత్పత్తుల పై ధరలను పెంచే అవకాశం ఉన్నందున ఈ స్టాకుల పట్ల మదుపరులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. అదే విధం గా , ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జి , మన దేశం 2010-2011 సంవత్సరానికి గాను 9 % వృద్ధి సాధించ గలదని భరోసా ఇవ్వటం కూడా మన మార్కెట్లకు కలిసొచ్చే అంశం .
టెక్నికల్ గా ఈ వారం సెన్సెక్స్ నకు 17800- 17880 మధ్య బలమైన అవరోధం ఉంది. దీనిని చేదించ గలిగితే సెన్సెక్స్ 18050 , ఆ తరువాత 18350 వరకు ఎగబాకే ప్రయత్నం చేయవచ్చు. మార్కెట్లు అమ్మకాల వత్తిడికి గురి అయితే 17575-17500 పాయింట్ల వద్ద మద్దత్తు తీసుకునే అవకాశం ఉంది. నిఫ్టీ పరం గా 5325 -5350 పాయింట్లు కీలక అవరోధం గా ఉండనున్నది. కాగా 5255 - 5230 పాయింట్ల స్థాయి కీలక మద్దతు గా అంచనా వేయవచ్చు.