• 05-04-2010
  • మార్కెట్ నాడి

సుదీర్ఘ వారంతం తరువాత నేడు మన మార్కెట్లు మరొక సారి ట్రేడ్ కానున్నాయి. శుక్రవారం ట్రేడ్ ఐన చైనా , తైవాన్ మార్కెట్లు లాభాల తో ముగియటం, నేడు కూడా ఇతర ఆసియా మార్కెట్లు శుభారంభం చేయటం మన మార్కెట్ల కు శుభసూచకం. అమెరికా మార్కెట్ల లో నిరుద్యోగ సమస్య స్వల్పం గా తగ్గుముఖం పడుతున్నదని గణాంకాలు సూచించటం తో గురు వారం అమెరికా మార్కెట్లు నష్టాలనుండి తేరుకుని ఫ్లాట్ గా ముగిసాయి.

కాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ( IMF ) విడుదల చేసిన ముసాయిదా లో 2010 సంవత్సరానికి ప్రపంచ ఆర్థికాభివృద్ధి అంచనాలని మించి వున్నదని, అమెరికా 3 % ,చైనా 10 % , జెర్మని 1.2 %, ఫ్రాన్స్ 1.5 %, ఐరోపా ప్రాంతం , ఇటాలి 0.8 % , UK 1.3 % చొప్పున వృద్ధి సాధించగలదని వెల్లడించటం తో నేడు ఆసియా మార్కెట్లు లాభాలను గడిస్తున్నాయి. సింగపూరు లో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ ఇండెక్స్ కూడా భారి గ్యాప్ అప్ తో ట్రేడ్ ప్రారంభం కావటం మన మార్కెట్లకు కలిసొచ్చే అంశం. ఐతే IMF అధినేత డామినిక్ స్ట్రాస్ అప్రమత్తం గా ఉండాలని సూచిస్తూ , ప్రస్తుతం ఈ ప్రపంచ దేశాలు సాధిస్తున్న అభివృద్ధి కేవలం ఉద్దేపనల కారణం గా జరుగుతున్నదని, ఇంకా ప్రైవేటు రంగం కోలుకోలేదని స్పష్టం చేసారు. చైనా సెంట్రల్ బ్యాంక్ సైతం అసెట్ బుడగ ఏర్పడే ప్రమాదమున్నదని , ముఖ్యం గా బ్రజిల్ , ఇండోనేసియా దేశాలు అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించింది.

ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్ల లో బంగారం, రాగి, వెండి మున్నగు కమాడిటి లు బలపడుతున్నాయి.

ఇక మన మార్కెట్ల పరం గా యోచిస్తే, ఉక్కు శాఖ మంత్రి స్టీల్ ధరలు పెరగటం తాత్కాలికమే అని భరోసా ఇచ్చినప్పటికీ, కంపనీలు ఉక్కు ధరణి పెంచగలవని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ అంశం వలన నేడు స్టీల్ రంగానికి చెందిన స్టాకులు లాభపడే అవకాశం ఉంది. అదే విధం గా భారత్ , చెక్కర దిగుమతి చేసుకున్నట్లు ప్రకటించటం తో చెక్కర స్టాకులు కుదేలుమనే అవకాశం ఉంది. IRDA , బీమా కంపనీలు , తమ లాభాలకు గండి పడకుండా , మూల ధనాన్ని DEBT PAPERS ద్వారా నిధులను సమకూర్చుకునే విధం గా నిర్ణయం తీసుకోవటం తో REL CAPITAL, MAX మున్నగు కంపనీలకు లాభదాయకం. అంతర్జాతీయ పెన్షన్ ఫండ్లు భారత్ లో పెట్టుబడి ని మరింత గా పెంచవచ్చని అంతర్జాతీయ రెటింగ్ సంస్థలు తెలియచేయటం కూడా మన మార్కెట్లకు లాభదాయకం.

ఈ సానుకూల అంశాల నేపద్యం లో నేడు మన మార్కెట్లు భారి లాభాలను ఆర్జించే దిశగా ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఐతే నేడు అమెరికా లో విడుదల అయ్యే గృహ అమ్మకాల గణాంకాల నేపధ్యం లో మధ్యాన్నం తదుపరి ఐరోపా మార్కెట్ల ప్రభావం వలన దూకుడు ధోరణి కి స్వస్తి చెప్పి స్థిరం గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17692
  • మద్దత్తు స్థాయిలు : 17670-17558-17445
  • అవరోధాలు : 17780-17910-17990.