• రైల్వే బడ్జెట్ ... అంచనాలు
వరుసగా ఏడోసారి కూడా రైల్వే ఛార్జీలను పెంచకుండానే బడ్జెట్‌ వచ్చే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులతో పాటు ఇతర ఆర్థిక అంశాలు రైల్వేలను ఛార్జీలు పెంచకుండా అడ్డుకొనే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనేది విశ్లేషకులు అంచనాగా ఉంది. అయినా ఛార్జీలు పెంచటానికి పార్లమెంట్‌ అనుమతి కావలసిన పరిస్థితి అయితే రైల్వే మంత్రికి అవసరం లేదనేది అందరి ఉద్దేశంగా ఉంది. దీనిని బట్టి ప్రస్తుతానికి ఛార్జీలు పెంచకపోయినా భవిష్యత్‌లో తప్పని సరిగా పెంచటానికి కావలసిన అవకాశాలు, అవసరాలు రైల్వేలకు మెండుగానే ఉన్నాయనేది వాస్తవం. ముఖ్యంగా శీతాకాల సమావేశాల సందర్భంగా రైల్వే మంత్రి ప్రవేశపెట్టిన రైల్వేస్‌ విజన్‌ 2020 పరిశీలించిన ఎవరికైనా అర్ధమైయ్యేదేమిటంటే భవిష్యత్తులో రైల్వేలు భారీ ఎత్తున ధరలు పెంచటమో లేక పోతే ప్రైవేట్‌ రంగాన్ని రైల్వేలలో ప్రోత్సహించటమో అనేది తప్పనిసరి అని అవగతమవుతుంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశ పెట్టిన 'విజన్‌-2020' ప్రకారం వచ్చే పది సంవత్సరాల కాలానికి రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క రైల్వేలకే అవసరమవుతాయని ఆమె తెలియజేశారు. దీని ప్రకారం రైల్వేలకు వచ్చే పది సంవత్సరాలు ఇప్పుడు వస్తున్న ఆదాయాలపైన మూడు రెట్లు వస్తేనే పై విజన్‌ పెట్టుబడులను సంపాదించు కోగలుగుతారనేది వాస్తవం. విజన్‌ డాక్యుమెంట్‌ ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యాన్ని 36 శాతం దాకా అనుమతి ఇచ్చినట్లయితే ప్రైవేట్‌ వర్గాల నుంచి రూ.5 లక్షల కోట్లు. సంస్థ సొంత రాబడుల నుంచి రూ.8.96 లక్షల కోట్ల పెట్టుబడులు రావలసి ఉంటుంది. అలానే 2009-10 ఆర్థిక సంవత్సరంలో పెట్టిన వార్షిక పెట్టుబడులు కేవలం రూ.40వేల కోట్లు అయితే ఈ మొత్తానికి మూడున్నర రెట్లు విజన్‌ అంచనాల ప్రకారం పెట్టుబడులు అవసరం అవుతాయి. అదేవిధంగా 2008-09 ఆర్ధిక సంవత్సరంలో పెట్టుబడుల కోసం బడ్జెటరీ సపోర్టుగా వచ్చిన మొత్తం రూ.9వేల కోట్లు, అంతర్గత వనరుల నుంచి పెట్టిన పెట్టుబడుల మొత్తం రూ.28వేల కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తాలు మూడు రెట్లు పెరగాలంటే రైల్వేల మొత్తం ఆదాయం తప్పని సరిగా ఇప్పుడున్న రూ.90వేల కోట్ల స్థాయి నుంచి మూడు రెట్లు అనగా రూ.2,70,000 కోట్లకు పెరిగితేనే విజన్‌కు కావలసిన పెట్టుబడులను సమకూర్చు కోగలుగు తామనేది వాస్తవ అంశాలుగా ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఛార్జీలను పెంచకుండా, పూర్తిగా అంతర్గత వనరుల నుంచి ఏ పరిస్థితులలోనైనా ఇంత పెద్ద మొత్తం పెట్టుబడులను రైల్వేలు సాధించటం అనేది ఎలా సాధ్యం? అందుకనే రైల్వే బడ్జెట్‌ గురించి, విజన్‌ 2020 అమలుకు బాటలు వేయటానికి కావలసిన కసరత్తు నేటి బడ్జెట్‌లోనే ప్రతిబింబించాల్సి ఉంది. ఈ విషయమై రైల్వే మంత్రికి, ప్లానింగ్‌ కమీషన్‌ డిప్యూటీ ఛైైర్మన్‌లకు ప్రధాన మంత్రి లేఖ రాసినట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. అందులో కూడా రైల్వే ఆదాయం పెంచుకోవటానికి గల అవకాశాలను అన్వేషించమని కోరినట్లుగా చెబుతున్నారు. గత ఏడు సంవత్సరాల్లో దాదాపుగా పాసింజర్‌ ఛార్జీలు పెంచని అంశాన్ని కూడా గుర్తుచేసినట్లు వినపడుతుంది. అలానే రైల్వే మంత్రిని ఆర్థిక మంత్రి సలహా తీసుకోమని కోరినట్లుగా కూడా వినపడింది.ఈ మేరకు ప్రతిరోజు సాయంత్రం సమయంలో మమతా బెనర్జీ ప్రణబ్‌ ముఖర్జీని రైల్వే బడ్జెట్‌ విషయమై కలుస్తున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్‌ సపోర్టుగా రూ.22వేల కోట్లు కావాలని అడిగినప్పటికీ, ఆర్థిక మంత్రి రూ.15వేల కోట్లు మాత్రమే ఇవ్వటానికే ఒప్పుకొన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ పరిస్థితులలో తాత్కాలికంగా ధరలను పెంపు చేయకుండా వనరులు పెంచుకోవటానికి కసరత్తులు ఎన్ని చేసినా భవిష్యత్తులో ధరలు పెంచటం అనేది తప్పని సరి.ఇప్పుడిప్పుడే ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ బైటపడి రికవరీ దిశగా పయనిస్తున్న తరుణంలో పారిశ్రామిక వృద్ధికి ఎంతో ఆవసరమైన రవాణా ఛార్జీలను పెంచటానికి ప్రభుత్వం ఒక పట్టాన అనుమతి ఇవ్వక పోవచ్చు .ఈ నేపధ్యం లో ప్రస్తుతానికి రైల్ బడ్జెట్ లో ఈ సారి సామాన్య ప్రయాణికుల పై భారం మోపక పోవచ్చు. ఐతే గూడ్స్ రవాణా పై మరియు ఉన్నత శ్రేణి తరగతి ప్రయానికుల పై వాసులు చేస్తున్న టికెట్ దరల పై కొంత మార్పులు తప్పవు కాబట్టి కమాడిటి స్టాకులు కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కొత్త రైళ్ళు , రైల్వే భద్రత, పారిశుభ్రత , రైళ్ళ ప్రయాణించే వారికి ఎప్పటికప్పుడు GPRS ద్వారా స్టేషన్ల సమాచారం మరియు సూచనలు , SMS సేవల ద్వారా ప్రయాణికు పై రైల్వే మంత్రి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది . అదే విధం గా విద్రోహుల చర్యల నుండి రైల్వే ని పరి రక్షించుకునే దిశ గా సెక్యు రిటి సిస్టం ల తో పాటు రక్షణ బలగాలను కూడా పెంచే ఆస్కారం ఉంది.