- 30-11-2009 :: 6pm
- మార్కెట్ రిపోర్ట్
దుబాయ్ సంక్షోభం కారణంగా శుక్రవారం భారీ నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ మార్కెట్, నేడు మా అంచనాలకి అనుగుణం గా ఆశాజనకంగా ముగిసింది. నేటి ట్రేడింగ్ ప్రారంభం నుంచి భారీ లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 294 పాయింట్లు పుంజుకుని, 16,926 మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 90 పాయింట్లు లాభపడి, 5,032 పాయింట్ల వద్ద ముగిసింది.సోమవారం ఆసియా, యూరప్ మార్కెట్లు లాభదాయకంగా కొనసాగడం బాంబే స్టాక్ మార్కెట్‌కు అన్ని విధాలా కలిసొచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీడీపీ వృద్ధిరేటు, మెటల్, టెక్, ఐటీ, కంజ్యూమర్ డ్యూరబుల్, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు పయనించింది. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిరేటు ఏడు శాతానికి పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన కూడా బాంబే స్టాక్ మార్కెట్ లాభదాయకంగా కొనసాగడానికి ప్రధాన కారణమైంది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.63 శాతం వృద్ధిని నమోదు చేయగా, స్మాల్ క్యాప్ రంగం 2.08 శాతం బలపడింది. నేటి ట్రేడింగ్ లో అన్ని సేక్టరాల్ సూచీలు లాభాల లో ముగియటం విశేషం. నేటి ట్రేడింగ్ లో మెటల్స్ రంగం అత్యధికం గా 3.66శాతం ఎగబాకింది. కాగా టెక్ ఇండెక్స్ 2.55 శాతం బలపడింది.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , హీరో హోండా 1.42 శాతం , భారతీయ స్టేట్ బ్యాంక్ 0.19 శాతం నష్టాలను చవిచూడగా, భారతి అయిర్ టెల్ 5.66 % , టాటా స్టీల్ 5.6 % చొప్పున లాభపడ్డాయి.