07-08-2009 :: 8 PM

మార్కెట్ రిపోర్ట్

రుతుపవనాలపై ఆందోళనలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ వారాంతంలో నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 354 పాయింట్లు కోల్పోయి 15,160 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 4,481 వద్ద ముగిసింది.ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్లు 74 పాయింట్లు క్షీణించి 15,441 వద్ద ప్రారంభమయింది. ప్రారంభ ట్రేడ్‌ల నుంచి ఇండెక్స్ రికవరీ అయేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆటో, రియాల్టీ, బ్యాంకింగ్ స్టాకుల్లో అదే పనిగా సాగిన విక్రయాలు మార్కెట్ భారీ నష్టాల్లోకి నెట్టాయి. దీంతో ఈ నష్టాల ప్రక్రియలో సెన్సెక్స్ 15,104 వద్దకు కనిష్టంగా పడిపోయింది. చివరకు 354 పాయింట్ల నష్టంతో స్టాక్ మార్కెట్ ముగిసింది.అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 4 శాతం మేర క్షీణించింది. కాగా, సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమాయనికి మొత్తం 2,748 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,921 కంపెనీల వాటాలు నష్టాలను చవిచూశాయి. అలాగే 745 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి.ద్రవ్య లభ్యతపై ఆందోళనలు వ్యక్తం అవడంతో.. చైనా మార్కెట్లు.. వీటి ప్రభావాన ఆసియా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. మరోవైపు ఈ మంగళవారం గరిష్ఠ స్థాయిల మార్కును చేరుకున్న అమెరికా మార్కెట్లు.. నాలుగు రోజుల లాభాలకు తెరవేస్తు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. నష్టాలను చవిచూసిన కంపెనీలు: రిలయన్స్ కమ్యూనికేషన్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, జేపీ అసోసియేట్స్, భెల్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యునిలివర్, స్టెరిలైట్, డీఎల్ఎఫ్, హిండాల్కో, రిలయన్స్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఐటీసీ, టీసీఎస్, హీరో హోండా, రిలయన్స్ ఇన్‌ఫ్రా, హెచ్‌డీఎఫ్ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి. లాభపడ్డ కంపెనీలు: ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, విప్రో తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.