23-05-2009
గత వారం టూకీగా
నూతన ప్రభుత్వం తో పాటు మన మార్కెట్లు కూడా ఈ వారం లో అడుగుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ ఆంచనాలకి విరుద్ధం గా దేశం లో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటయ్యే దిశ గా ఎన్నికల ఫలితాలు వెలువడటం మన మార్కెట్ల లో ఊహించని విధం గా గొప్ప ఉత్సాహం కలిగించింది.
సోమవారం మన మార్కెట్లు ప్రారంభమయిన కొన్ని క్షణాలకే 15% గరిష్ట సర్క్యూట్ చేరి రెండు గంటల పాటుట్రేడింగ్ నిలిపివేయబడింది. తిరిగి ట్రేడింగ్ ప్రారంభమయిన కొద్ది క్షణాలకే మరల 20% గరిష్ట స్థాయి చేరుకోవడం తో మార్కెట్లను పూర్తిగా నిలిపివేశారు. . ఈ విధం గా దేశ క్యాపిటల్ మార్కెట్ చరిత్ర లో ఒక కొత్త రికార్డు ని నెలకొల్పాయి మార్కెట్లు. సెన్సెక్స్ 2110 పాయింట్లు లాభం పడి 14284 పాయింట్ల వద్ద ముగిసింది.కాగా నిఫ్టీ 651 పాయింట్లు లాభం పడి 4323 పాయింట్ల వద్ద ముగిసింది.
మంగళవారం మార్కెట్లు టర్న్ ఓవర్ లో రికార్డు ని నెలకొల్పాయి. మార్కెట్లు 1.58 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసి గతం లో 18 అక్టోబర్ 2007 న 1.48 లక్షల కోట్ల రూపాయల రికార్డు ని తిరగ రాసింది. ఇది ఇలా ఉండగా , మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులతో పయనం సాగించింది. సెన్సెక్స్ 14302 పాయింట్ల వద్ద కేవలం 18 పాయింట్ల స్వల్ప లాభం తో ముగిసింది. కాగా నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 4318 వద్ద ముగిసింది. నాడు స్టాక్ మార్కెట్లలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాకులు లాభం పొందాయి .మిడ్ క్యాప్ షేర్లు 3.6 % , స్మాల్ క్యాప్ షేర్లు 2.5 % లాభాలను ఆర్జించాయి.
బుధవారం మిడ్ క్యాప్ షేర్లు, స్మాల్ క్యాప్ షేర్లు గణనీయంగా 6% ,8.9 % లాభ పడ్డాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 14060 వద్ద ముగియగా, నిఫ్టీ 48 పాయింట్లు నష్ట పోయి 4270 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లో నేడు టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు, LIC నుండి 3250 కోట్ల రూపాయల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపం లో ఫండ్స్ లబ్ది పొందటం తో ,ఈ కౌంటర్ షేర్లు అత్యధికంగా 19 %, 13 % పెరిగాయి.
గురువారం వరుసగా రెండవ రోజు మన మార్కెట్లు నష్టాలలో ముగిసాయి. బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నడుమ మన మార్కెట్లు కూడా శృతి కలిపాయి. సెన్సెక్స్ 324 పాయింట్లు నష్ట పోయి 13736 వద్ద ముగిసింది. కాగా నిఫ్ట్ 59 పాయింట్లు నష్టపోయి 4210 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లో స్మాల్ క్యాప్ లు 2.6 % లాభం పడగా, మిడ్ క్యాప్ లు ఫ్లాట్ గా ముగిసాయి. పి . ఎస్ . యు -ఆయిల్ కంపెనీలు సంస్కరణల వార్తలు వినవస్తున్నందున అధికంగా లాభం పడ్డాయి. ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీల హయామ నుండి ఫ్రీ మార్కెట్ క్రింద మార్చాలని ఆయిల్ మంత్రిత్వ శాఖ యోచన. ఇది కాగా , మే 9 నకు చెందిన ద్రవ్యోల్బణం 0.61 % గా తేలింది. అంతకు ముందు వారం ఇది 0.48 % గా నమోదయ్యింది.
శుక్రవారం మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యి , చివరకు యూరోప్ మార్కెట్ల ప్రభావం వలన లాభాల తో మూగిసింది. సెన్సెక్స్ 150 పాయింట్లు లాభం పడి 13887 వద్ద ముగియగా, నిఫ్టీ 4238 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లో స్మాల్ క్యాప్ అత్యధికం గా 3.19 % లాభం పడింది .కాగా మిడ్ క్యాప్ 1.75 %, సెన్సెక్స్ 1.1 % లాభం పడింది.
ఈ వారాంతానికి మార్కెట్లు వరుసగా పదకొండవ వారం లాభాలను ఆర్జించాయి. మార్చ్ 1992 తరువాతా ఈ విధంగా లాభ పడటం ఇదే ప్రథమం. ఈ వారం సెన్సెక్స్ 14.4 % లాభ పడగా , నిఫ్టీ 15.44 % లాభ పడింది.
షేర్లను విడిగా పరిశీలిస్తే R.COM 29 %, TATA MOTORS 26.6 %, RELIANCE ENERGY 26.05 %, TATA STEEL 25.75 % ONGC 25.06 % వృద్ధిని నమోదు చేసి మదుపరులకు సిరుల పంట పండించాయి.
ఈ వారం రియల్టి రంగం 37.7 % వృద్ధిని నమోదు చేయగా , క్యాపిటల్ గుడ్ రంగం 28 % వృద్ధిని నమోదు చేసింది. ఐ. టి రంగం మాత్రమే ఈ వారం నష్టాలని చవిచూసింది. ఈ రంగం స్వల్పంగా 0.7 % నష్టపోయింది.
గత వారం మేము , మే 22 వరకు సెన్సెక్స్ 13745 పాయింట్ల వద్ద ముగుస్తుందని తెలియచేసాము. మా అంచనాలని ఇంచు మించు నిజం చేస్తూ సెన్సెక్స్ 13887 వద్ద ముగియటం విశేషం .
......
..................