• మార్కెట్ ముందుచూపు
  • ( 29 -3-2010 నుండి 1-4-2010 వరకు )
గడిచిన వారం లో చివరి రెండు రోజులు లాభాలను ఆర్జించటం తో వరుసగా ఎడోవ వారం మన మార్కెట్లు లాభాలను ఆర్జించాయి . గడిచిన వారం సెన్సెక్స్ కనిష్టం గా 17337 పాయింట్ల మార్కు ని నమోదు చేయగా, గరిష్టంగా 17683 పాయింట్ల వరకు ఎగబాకి చివరికి 17645 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం గత జనవరి లో నమోదుచేసిన గరిష్ట స్థాయి కి కేవలం 150 పాయింట్ల దూరం లో సెన్సెక్స్ ఉంది . గ్రీస్ దేశం లో నెలకొని వున్న సంక్షోభానికి సానుకూలం గా పరిష్కారం లభించటం , భారత మార్కెట్ల లో విదేశీ పెట్టుబడులు విశేషంగా తరలి రావటం మున్నగు అంశాలు మన మార్కేట్లని లాభాల బాట లో నడిపించాయి. ఈ మాసం లో విదేశీ సంష్టాగత మదుపరులు సుమారు 12000 కోట్ల రూపాయల మేరకు కొనుగోలు చేయటం విశేషం . రిజర్వు బ్యాంక్ రేపో రేటు ని పెంచటం తో రియల్ ఎస్టేట్ ,ఆటో రంగానికి చెందిన స్టాకులు నష్టపోయినప్పటికీ, దిగువ స్తాయిల లో మద్దత్తు లభించటం తో ఈ స్టాకులు మరల పుంజుకున్నాయి. ఇక ఈ వారం అంశాలను పరిశీలిస్తే, ఆటో , సిమెంట్ రంగానికి చెందిన ఎగుమతి మరియు అమ్మకాల గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంశం వలన ఈ వారం ఈ స్టాకుల లో చలనం కనిపించ వచ్చు. అదే విధం గా ఉక్కు ఉత్పత్తి తాలూకు గణాంకాలు కూడా విడుదల కానున్నాయి. రేపు, అనగా సోమవారం , రిజర్వు బ్యాంక్ అధికారులు ఆర్ధిక మంత్రిత్వ శాఖ తో , 2010 -2011 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రభుత్వ అవసరాలకు నిధుల సమీకరణ పై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశం లో కీలక వడ్డీ రేటు గురించే కాక ఉద్దేపనల ఉపసంహరణ మున్నగు అంశాల పై ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఈ కారణం గా మార్కెట్లు అత్యంత ఆసక్తి తో ఈ సమావేశాపు ఫలితాలను గమనించ నున్నాయి. ప్రతికూల ప్రకటనలు వెల వడితే , బ్యాంకింగ్, ఆటో , రియల్ ఎస్టేట్ రంగాలకి చెందిన స్టాకులు మరొక సారి అమ్మకాల వత్తిడి కి గురి అయ్యే ప్రమాదమున్నది.
అంతర్జాతీయ పోకడలు , ముఖ్యం గా గ్రీస్ తదుపరి క్యూ లో వున్న పోర్చుగల్ పట్ల ఐరోపా దేశాల స్పందన , అమెరికా మార్కెట్ల లో GDP గణాంకాలు మన మార్కెట్ల దిశ ని కొంత వరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది.
టెక్నికల్ గా ఈ వారం సెన్సెక్స్ నకు 17850 -17950 పాయింట్ల వద్ద అవరోధం ఉన్నది. కాగా 17500-17430 పాయింట్ల వద్ద విశేషమైన మద్దత్తు మూట గట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. నిఫ్టీ పరం గా 5310-5340 కీలక అవరోధస్తాయి. కాగా 5230-5205 పాయింట్ల వద్ద మద్దత్తు లభించే ఆస్కారం ఉంది . మూమేన్టం సూచికలు బలంగా ఉన్నందున షార్ట్ టర్మ్ నకు మార్కెట్లకు ఇబ్బందిలేదనే చెప్పవచ్చు. ఐతే మధ్యమ కాల వ్యవధి కి మాత్రం 5055 పాయింట్ల కంటే దిగువన , దిద్దుబాటు జరుగుతున్నదని అంచనా వేయవచ్చు. ఈ వారం మార్కెట్లు స్థిర పడే విధం గా ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి.